భారత రాజ్యాంగం - ప్రధాన లక్షణాలు
వలసపాలనలో దోపిడీకి గురైన భారతదేశం రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసుకున్నది. 1946 డిసెంబరు 9న జరిగిన తొలి రాజ్యాంగ పరిషత్ సమావేశంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడి రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర వహించింది. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పాటు కృషిచేసి, రాజ్యాంగాన్ని రూపొందించి, 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగానికి కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. లిఖిత, సుదీర్ఘ రాజ్యాంగం
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. దాదాపు 60 రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత దేశంలో ఉన్న ''భిన్నత్వాన్ని'' దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అల్పసంఖ్యాక వర్గాలు మొదలైనవారికి అనేక రక్షణలు కల్పించారు. రాజ్యాంగ రచనా సమయంలో 395 నిబంధనలు, 22 భాగాలు, ఎనిమిది షెడ్యూళ్లు ఉన్నాయి. 66 ఏళ్లుగా జరిగిన మార్పుల వల్ల ప్రస్తుతం 467 నిబంధనలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. 368 నిబంధన ప్రకారం అనేక రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఇటీవల చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి) చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపుదిద్దుకుంది.
రాజ్యాంగ పీఠిక
'భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వాతంత్య్రాన్నీ, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్నీ చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతనూ, అఖండతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించడానికి సత్యనిష్ణా పూర్వకంగా తీర్మానించుకుని 1949వ సంవత్సరం నవంబరు 26వ తేదీన మా రాజ్యాంగ సభలో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం'
భారత రాజ్యాంగానికి పీఠిక భరత వాక్యం లాంటిది. ఇది రాజ్యాంగ మౌలికతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాలు- ఆశయాలు (ఆబ్జెక్టివ్స్-రిజల్యూషన్స్) దీనికి మూలాధారం. రాజ్యాంగ పీఠికను ఉపోద్ఘాతం, అవతారిక, ముందుమాట, ప్రస్తావన అని కూడా అంటారు.
పీఠిక అంత : స్వరూపం
1. అధికారానికి / సార్వభౌమత్వానికి మూలం
2. భారత రాజ్య స్వభావం
3. భారత రాజ్యాంగ లక్షణాలు
4. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు
అధికారానికి / సార్వభౌమత్వానికి మూలం (సోర్స్ ఆఫ్ అథారిటీ) : పీఠికలో 'భారత ప్రజలమైన మేము... ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం' అని పేర్కొనడంలోనే భారతదేశంలో అధికారానికి మూలం ప్రజలనే విషయం అర్థమవుతుంది. తద్వారా భారతదేశం ఒక సర్వసత్తాక రాజ్యమని తెలుస్తుంది.
భారత రాజ్య స్వభావం : పీఠికను అనుసరించి 'భారత రాజ్య' స్వభావాన్ని కింది విధంగా చెప్పవచ్చు.
భారతదేశం స్వేచ్ఛగా తన విధానాలను రూపొందించుకుంటుంది. అంతర్గతంగా, బాహ్యంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, అత్యున్నత అధికారాన్ని కలిగి ఉండటమే సార్వభౌమత్వ భావ సారాంశం.
సామ్యవాదం: అంటే రాజ్యం క్రమేణా జాతీయ సంపదలో మార్పులు తెచ్చి సమసమాజ స్థాపన చేయడం. భారత రాజ్యాంగంలో సామ్యవాద భావజాలం అం తర్లీనమై ఉంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'సామ్యవాద' అనే అంశం పీఠికకు చేర్చడంలో ఇది ప్రస్ఫుటం అవుతుంది.
లౌకిక : దేశంలో అన్ని మతాలకూ పూర్తి స్వేచ్ఛ, సమానత్వాలను కల్పించి, సమానంగా ఆదరించ డం. ఈ అంశాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
ప్రజాస్వామ్యం: ''ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ (గవర్నమెంట్ ఆఫ్ దా పీపుల్, బై దా పీపుల్, అండ్ ఫర్ దా పీపుల్)'' అని అర్థం. ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ రంగానికే కాకుండా సామాజిక, ఆర్థిక రంగాలకు కూడా వర్తిస్తుంది.
గణతంత్రం : అంటే దేశాధినేత, ప్రజాప్రతినిధులు వంశపారంపర్యంగా కాకుండా నిర్ణీత కాలానికి ఎన్నికవుతారు. దేశంలోని అన్ని పదవులకూ పౌరులందరూ అర్హులేనని అర్థం.
రాజ్యాంగ ఆశయాలు
న్యాయం (జస్టిస్) : ప్రజాస్వామ్యంలో పౌరులందరూ సమానులే. రాజ్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందిస్తుంది.
స్వేచ్ఛ : నిజమైన ప్రజాస్వామ్య స్థాపనకు, స్వేచ్ఛాయుత నాగరిక జీవనం గడపడానికి, ప్రతి వ్యక్తికీ ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసం, ఆరాధనలకు హామీ ఇవ్వడం. ఈ అంశాన్ని ఫ్రెంచ్ విప్లవం (1789-99) నుంచి స్వీకరించారు.
సమానత్వం : అంటే అన్ని రకాలైన వివక్షలను రద్దుచేసి ప్రతి వ్యక్తి తనను తాను పూర్తిగా అభివృద్ధి చేసుకునేందుకు సమాన అవకాశాలు, హోదాను అందించడం.
సౌభ్రాతృత్వం : దేశంలోని ప్రజల మధ్య సోదరభావాన్ని కల్పించడమే సౌభ్రాతృత్వం. వ్యక్తి గౌరవం, దేశ ఐక్యత, సమగ్రతలను పెంపొందించేందుకు ఇది అవసరం.
సమగ్రత : సమగ్రత అనేది దేశ ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది. 42వ రాజ్యా ంగ సవరణ ద్వారా పీఠికకు సమగ్రత అనే పదాన్ని చేర్చారు.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు (Date of adoption of the Constitution) : భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని 26 నవంబరు 1949న ఆమోదించింది. తద్వారా 26 జనవరి 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా, కాదా ? (Amendabil ity of the Preamble) : రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులు వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చినట్లే పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా, కాదా అనే వివాదంపై సుప్రీంకోర్టు విభిన్న సందర్భాల్లో వివిధ తీర్పులను వెల్లడించింది.
బెరిబెరి కేసు (1960)లో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది. అయితే కేశవానంద భారతి కేసు (1973)లో తీర్పు వెలువరిస్తూ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగ ంగా పేర్కొంటూ, పీఠికను రాజ్యాంగ మౌలిక అంశాలు (బేసిక్ స్ట్రక్చర్)లో భాగంగా అభివర్ణించింది. తర్వాతి కాలంలో అనేక కేసుల్లో తన భావనను పునరుద్ఘాటించింది.
రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా ? (Amendabil ity of the Preamble) : కేశవానంద భారత కేసు (1973)లో ఇచ్చిన తీర్పును అనుసరించి రాజ్యాంగ పీఠిక రాజ్యా ంగంలో అంతర్భాగం. కాబట్టి అధికరణం- 368 ప్రకారం పీఠికను సవరించవచ్చు. అయితే ఆ సవరణ రాజ్యాంగ మౌలిక లక్షణ పరిధిలో ఉండాలి. 1976లో మొదటిసారిగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'సామ్యవాద, లౌకిక, సమగ్రత' పదాలను చేర్చి పీఠికకు పరిపూర్ణత కల్పించారు.
No comments:
Post a Comment