ఆదేశిక సూత్రాలు - Grate Thing

Breaking

Home Top Ad

Thursday, August 29, 2019

ఆదేశిక సూత్రాలు

ఆదేశిక సూత్రాలు


భారతదేశాన్ని ఒక సంక్షేమ, ఉత్తమ, ఆదర్శ రాజ్యంగా నిర్మించడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను చేర్చారు. వీటి అమలు ద్వారా ఆర్థిక, సాంఘిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. దాని సిద్ధాంతాలు, విధానాలకు అతీతంగా ఆదేశిక సూత్రాలను అమలుపరచాలి. ఈ సూత్రాలు రోమ్‌లో ఆవిర్భవించాయి. అక్కడి నుంచి స్పెయిన్, ఐర్లాండ్ ఆ తర్వాత ఇండియాకు వచ్చాయి. వీటిని మనదేశం నుంచి చైనా గ్రహించింది. ఈ సూత్రాలను రాజ్యాంగంలోని ఐగవ భాగంలో చేర్చారు. 36 నుంచి 51 వరకు ఉన్న అధికరణలు ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి.

ఆదేశిక సూత్రాల స్వభావం, లక్ష్యాల ఆధారంగా ప్రముఖ పరిపాలన శాస్త్రవేత్త ఎం.పి.శర్మ వీటిని మూడు రకాలుగా విభజించారు. అవి:

1. సామ్యవాద సూత్రాలు
2. గాంధేయ సూత్రాలు 
3. ఉదారవాద సూత్రాలు 

సామ్యవాద సూత్రాలు: నిబంధన 38, 39, 39(A), 41, 42, 43, 43(A) వీటి గురించి తెలియజేస్తాయి.

నిబంధన 38: భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం. దీని సాధన కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి. దీంట్లో భాగంగా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, 1955 అంటరానితనం నిషేధ చట్టం, 1976 పౌరహక్కుల చట్టం, 1961 వరకట్న నిషేధ చట్టం మొదలైనవాటిని రూపొందించారు.

నిబంధన 39: భౌతిక సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయాలి. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని సంపదను వినియోగించుకోవాలి. స్త్రీ, పురుషులకు సమాన జీతభత్యాలను చెల్లించాలి. సంపద వికేంద్రీకరణ కోసం 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1951లో భూ సంస్కరణల చట్టాన్ని రూపొందించారు.

నిబంధన 39(A): వికలాంగులు, పేదవారికి ఉచిత న్యాయ సలహా అందించాలి. దీని కోసం 1987లో లీగల్ సర్వీసుల చట్టాన్ని రూపొందించారు.

నిబంధన 41: పనిహక్కు కల్పించాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి. వికలాంగులు, వృద్ధులు, అనాథలకు చేయూతనివ్వాలి. 1987లో వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని, 2006లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు.

నిబంధన-42: మహిళా సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. ప్రసూతి కేంద్రాలను విస్తరించాలి. 1961లో మాతృత్వ ప్రయోజన, 2007 లో పితృత్వ ప్రయోజన చట్టాలను రూపొందించారు.

నిబంధన 43: కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరుస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. కార్మికుల మానసిక, శారీరక వికాసానికి చర్యలు చేపట్టాలి. వీటిని అభివృద్ధి పరచడానికి నేషనల్ ఖాదీ అసోసియేషన్, నేషనల్ హ్యాండ్‌లూమ్ అసోసియేషన్ లాంటివాటిని స్థాపించారు.

గాంధేయ సూత్రాలు: నిబంధన 40, 43(B), 46, 47, 48, 48(A), 49 వీటి గురించి తెలియజేస్తాయి

నిబంధన 40: గ్రామ స్వరాజ్యం, గ్రామీణ సమీకృత అభివృద్ధి కోసం స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. 1952లో సమాజ అభివృద్ధి పథకం, 1953లో జాతీయ విస్తరణ పథకాన్ని ప్రవేశపెట్టారు

నిబంధన 43(B): సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా కల్పించారు. దీన్ని 2013 లో 97వ సవరణ ద్వారా చేర్చారు

నిబంధన 46: సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యా, సామాజిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దీంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు

నిబంధన 47: ప్రజారోగ్య పరిరక్షణ, అంటు వ్యాధుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యానికి హాని కలిగించే మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలను నిషేధించాలి. మద్యపాన నిషేధాన్ని గుజరాత్ అమలు పరుస్తోంది. ఇటీవల కేరళ ప్రభుత్వం దశలవారీగా నిషేధాన్ని విధించడానికి నిర్ణయించింది

నిబంధన 48: వ్యవసాయం, పాడి పరిశ్రమలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలి. పశువులు, ఇతర పెంపుడు జంతువుల వధను నిర్మూలించాలి. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు

నిబంధన 48(A): వన్యమృగాలను, పర్యావరణాన్ని పరిరక్షించాలి. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1980లో అడవుల పరిరక్షణ చట్టం, 1988లో జాతీయ అడవుల విధానాన్ని రూపొందించారు

నిబంధన 49: భారతదేశ ఉన్నత సంస్కృతి, వారసత్వం, చారిత్రక ప్రదేశాలను పరిరక్షించాలి. చారిత్రక ప్రదేశాల పరిరక్షణ చట్టాన్ని 1958లో రూపొందించారు. కేంద్రసాహిత్య అకాడమీ, సంగీత అకాడమీని ఏర్పాటు చేశారు.

ఉదారవాద సూత్రాలు: నిబంధన 44, 45, 50, 51 వీటి గురించి తెలియజేస్తాయి

నిబంధన 44: ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం ప్రస్తుతం హిందూ, ముస్లింలకు వేర్వేరుగా ఉన్న ఫ్యామిలీ చట్టాలను రద్దుచేసి అందరికీ ఒకే చట్టాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీన్ని అమలు పరచాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి సూచించింది. దీన్ని గోవా రాష్ట్రం మాత్రమే అమలు పరుస్తోంది

నిబంధన 45: ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి. శిశు, పూర్వ శిశు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

నిబంధన 50: న్యాయశాఖ ప్రతిపత్తి కాపాడేందుకు కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయాలి

నిబంధన-51: ప్రపంచ శాంతి, సమగ్రతకు తోడ్పడాలి. ఇందులో భాగంగానే ఐరాసలో సభ్యదేశంగా చేరాం. ప్రచ్ఛన్న యుద్ధం నుంచి ప్రపంచాన్ని విముక్తి పరిచేందుకు 1961లో అలీన విధానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించాం.

1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలు:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి

ప్రజలకు ఉచిత న్యాయసలహా అందించాలి

పిల్లలు హుందాగా పెరగడానికి అవకాశం కల్పించాలి.

యువత దోపిడీకి గురి కాకుండా నియంత్రించాలి.

పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యాన్ని కల్పించాలి.

2002లో 86వ సవరణ ద్వారా చేర్చిన అంశం:

ఆరేళ్ల లోపు పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించాలి. శిశు, పూర్వ శిశు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

2013లో 97వ సవరణ ద్వారా చేర్చిన అంశం:

సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా.

విమర్శనాత్మక పరిశీలన

‘నిర్దేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించనంత కాలం అవి అంతగా పట్టించుకోదగినవి కావు.’ - కె. సంతానం

‘నిర్దేశిక నియమాలు ఒక బ్యాంకు తనకు అనుగుణంగా చెల్లించే చెక్కు లాంటివి.’ - ప్రొఫెసర్ కె.టి.షా

‘1935 చట్టంలోని ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ను పోలి ఉన్నాయి.’ - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

‘వైవిధ్య సెంటిమెంట్లతో కూడిన ఒక చెత్త బుట్ట లాంటివి.’ - టి.టి. కృష్ణమాచారి

ప్రాథమిక విధులు

విధి అంటే సమాజం, ఇతర వ్యక్తుల పట్ల నిర్వహించాల్సిన బాధ్యత. విధుల లక్ష్యం సమాజ సంక్షేమం. ప్రారంభంలో రాజ్యాంగంలో విధులను చేర్చలేదు. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 10 ప్రాథమిక విధులను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలోని IV(A) భాగంలో చేర్చారు. వీటి గురించి నిబంధన 51(A) తెలియజేస్తుంది. విధులను రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ప్రతి భారతీయ పౌరుడికి కింద పేర్కొన్న విధులు ఉన్నాయి.

51(A): రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి.

51(B): జాతీయ స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తితో ఉన్నత ఆదర్శాలను పాటించాలి.

51(C): భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సమగ్రతను కాపాడాలి.

51(D): దేశరక్షణకు, జాతీయ సేవకు ముందుకు రావాలి.

51(E): మత, భాష, ప్రాంతీయ వర్గ వైరుధ్యాలకు అతీతంగా సోదర భావాన్ని పెంపొందించాలి. స్త్రీలను గౌరవించాలి.

51(F): భారత భిన్న సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించాలి.

51(G): అడవులు, సరస్సులు, నదులు, వన్య ప్రాణులు సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడాలి. జీవులపట్ల కారుణ్యం కలిగి ఉండాలి.

51(H): శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి.

51(I): హింసను విడనాడాలి. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి.

51(J): వ్యక్తిగతంగా, సమిష్టిగా దేశ అభివృద్ధికి తోడ్పడాలి.

2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చారు. దీని గురించి నిబంధన 51(K) తెలియజేస్తుంది.

51(K): ఆరు నుంచి పద్నాలుగేళ్ల లోపు ఉన్న పిల్లలకు విద్యావకాశాలను కల్పించే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిగి ఉండాలి.

ఆదేశిక సూత్రాల లక్షణాలు

కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు మార్గ దర్శకంగా ఉంటాయి.

శ్రేయోరాజ్యస్థాపన వీటి ఉద్దేశం.

ఇవి ఆర్థిక, సాంఘిక సమానత్వ సాధనకు తోడ్పడతాయి.

న్యాయస్థానాల ద్వారా వీటికి రక్షణ లేదు.

ఈ సూత్రాలు స్వయంగా అమల్లోకి రావు.

No comments:

Post a Comment

Pages

close