1857 తిరుగుబాటు - Grate Thing

Breaking

Home Top Ad

Friday, September 13, 2019

1857 తిరుగుబాటు

శతాబ్ద కాలంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తి జ్వాల 1857 తిరుగుబాటు రూపంలో చెలరేగింది. యూరోపియన్లలో కొందరు దీన్ని ‘సిపాయిల తిరుగుబాటు’ అని  పేర్కొనగా, మరికొందరు దీన్ని మత దురభిమానులు సాగించిన యుద్ధం, జాతుల మధ్య పోరాటం, నాగరికత-ఆటవికత మధ్య సాగిన సంఘర్షణ అని పేర్కొన్నారు. భారతదేశంలోని జాతీయవాదులు, చరిత్రకారులు దీన్ని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నారు. వారిలో వి.డి.సావర్కర్ ప్రథములు. ఆర్.సి. మజుందార్ దీన్ని ‘ఒక తిరుగుబాటు’గా పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ప్రముఖ చారిత్రక సంఘటనల్లో 1857 తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది.
 తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం దీన్ని 5 విధాలుగా వర్గీకరించొచ్చు. అవి..
 1. సిపాయిల పితూరీ
 2. జాతి సంఘర్షణ
 3. హిందువులు, మహ్మదీయులు కలిపి పన్నిన కుట్ర
 4. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం
 5. స్వాతంత్య్ర సమరానికి నాందీ (లేదా) మొదటి మెట్టు
  తిరుగుబాటుకు కారణాలు
 ఆంగ్ల చరిత్రకారులు భావించినట్లు కేవలం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాల కారణంగానే 1857లో తిరుగుబాటు జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అవి..
  డల్హౌసీ విధానాలు (లేదా) రాజకీయ కారణాలు
  సాంఘిక కారణాలు
  మత సంబంధమైన కారణాలు
  ఆర్థిక కారణాలు
  సైనిక కారణాలు
  తక్షణ కారణం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలు
  డల్హౌసీ విధానాలు(లేదా) రాజకీయ కారణాలు
 రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా, నాగ్‌పూర్, భరత్‌పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ వంటి హిందూ రాజ్యాలు ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. ఆ విధంగా రాజ్యాలను కోల్పోయిన స్వదేశీ రాజులు తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించారు.
 సాంఘిక కారణాలు
 పాశ్చాత్య నాగరికత పట్ల భారతీయులు విముఖత  చూపారు. దాని వ్యాప్తి వల్ల తమ ప్రాచీన సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందారు. నరబలి, సతీసహగమనం, బాల్య వివాహాలను ఆంగ్లేయులు రద్దు చేయడం, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వంటివన్నీ భారతీయులకు వింతగా, సనాతన ధర్మానికి విరుద్ధంగా తోచాయి.
మత కారణాలు
 హిందువులను క్రైస్తవులుగా మార్చనిదే వారు నాగరికులు కాలేరని, తమకు విశ్వాసపాత్రులై ఉండరని భావించి ఆంగ్లేయులు క్రైస్తవ మత బోధన సాగించారు. విద్యా సంస్థల్లో నిర్బంధ బైబిల్ బోధనను ప్రవేశపెట్టారు. అయితే ఖురాన్, హిందూ మత గ్రంథాల బోధనకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు.
 ఆర్థిక కారణాలు
 ఆంగ్లేయులు స్వదేశీ రాజ్యాలను ఆక్రమించడంతో ఆయా రాజ్యాల్లోని ప్రభుత్వోద్యోగులు, సైనికులు నిరుద్యోగులుగా మిగిలారు. ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవ ప్రభావం ఫలితంగా భారతదేశంలో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. విదేశీ వస్తువులు చౌకగా లభించడం వల్ల స్వదేశీ పరిశ్రమలపై ఆధారపడిన వారు నిరుద్యోగులయ్యారు. క్షామ కాలంలో ప్రజలకు తగిన రీతిలో సాయం లభించలేదు. ప్రజా సంక్షేమంపై ఆంగ్లేయులు సరైన దృష్టి సారించలేదు.
 సైనిక కారణాలు
ఆంగ్ల సైనికులతో పోల్చితే భారత సిపాయిల జీతభత్యాలు చాలా తక్కువగా ఉండేవి. అర్హత, శక్తి సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారికి, ఆంగ్లేయుల ఆదరాభిమానాలు చూరగొన్న వారికి మాత్రమే ఉన్నత పదవులు లభించాయి.
తక్షణ కారణం
కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్‌లో ఉపయోగించే తూటాల చుట్టూ ఆవు, పంది కొవ్వు పూస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. ఆవు హిందువులకు పవిత్రం కాగా, పంది మహ్మదీయులకు నిషిద్ధ జంతువు. దాంతో హిందూ, ముస్లిం సిపాయిలు ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటుకు ఉపక్రమించారు.
 ఆయా ప్రాంతాల్లో తిరుగుబాటు నాయకులు
కాన్పూర్: ఇక్కడ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించాడు. రావుసాహిబ్, తాంతియాతోపే, అజీముల్లాఖాన్ (సలహాదారు) అతడికి మద్దతుగా నిలిచారు. కాన్పూర్‌ను 1857, డిసెంబర్‌లో బ్రిటిష్ సైన్యాధికారి కొలిన్ క్యాంప్‌బెల్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. నానాసాహెబ్ నేపాల్‌కు పారిపోయాడు. 1859లో ప్రభుత్వం ఇతడిని కాల్చి చంపింది.

లక్నో: ఇది అవథ్ రాజధాని. 18 నెలల తన కుమారుడి
తరఫున తల్లి ‘బేగం హజ్రత్ మహల్’ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఆమె సలహాదారు అహ్మదుల్లా.  కొలిన్ క్యాంప్‌బెల్ 1858, మార్చి 18న లక్నోను స్వాధీనం చేసుకున్నాడు. బేగం హజ్రత్ మహల్ నేపాల్‌కు పారిపోయింది.
ఝాన్సీ, గ్వాలియర్: లక్ష్మీబాయి ముందుగా ఝాన్సీలో పోరాటం చేసింది. ఝాన్సీని జనరల్ హ్యూరోస్ స్వాధీనం చేసుకున్నాడు. గ్వాలియర్ రాజు సింధియా బ్రిటిష్ పక్షాన నిలిచాడు. కానీ అతని సైనికులు ఝాన్సీ లక్ష్మీబాయిని నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. గ్వాలియర్‌లో యుద్ధం చేస్తున్న లక్ష్మీబాయి 1858, జూన్ 17న బ్రిటిష్  జనరల్ హ్యూరోస్ చేతిలో చనిపోయింది. తాంతియాతోపే ఝాన్సీ, గ్వాలియర్ రెండు చోట్ల లక్ష్మీబాయికి మద్దతుగా నిలిచాడు. బిహార్: బిహార్‌లోని అర్రా అనే ప్రాంతంలో 70 ఏళ్ల జమీందారు కున్వర్‌సింగ్, అతని సోదరుడు అమర్‌సింగ్‌లు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

 రాయ్‌బరేలి: ఖాన్ బహమర్ ఖాన్
 ఫైజాబాద్ : మౌలానా అహ్మదుల్లా

 ఢిల్లీ: ఇక్కడ తిరుగుబాటుకు నామమాత్రపు నాయకుడు రెండో బహదూర్‌షా. ఇతను తిరుగుబాటుదారులపై పెద్దగా నమ్మకం చూపకుండా ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాడు. అతని భార్య బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారితో కుమ్మక్కైంది. ఢిల్లీలో తిరుగుబాటుకు నిజమైన నాయకుడు రాయ్‌బరేలీలో సుబేదార్‌గా పనిచేసిన ‘జనరల్ భక్త్‌ఖాన్’. ఢిల్లీని ‘జాన్ నికల్సన్’ అనే బ్రిటిష్ సైన్యాధికారి 1857, సెప్టెంబర్‌లో తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. లెఫ్టినెంట్ హడ్సన్ అనే బ్రిటిష్ సైన్యాధికారి రెండో బహదూర్‌షా కుమారుడు ఫకీరుద్దీన్‌తోపాటు అతని కుమారుణ్ని కాల్చి చంపాడు.
బ్రిటిష్ ప్రభుత్వం రెండో బహదూర్‌షా, అతని భార్య జీనమహల్‌ను దేశాంతర వాస శిక్ష కింద బర్మాలోని రంగూన్‌కి  పంపించింది. వారు అక్కడే మరణించారు.
 ‘జనరల్ భక్త్‌ఖాన్’ అవధ్‌కు వెళ్లి బేగం హజ్రత్ మహల్‌కు అండగా నిలిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన అతణ్ని ప్రభుత్వం1859లో పట్టుకుని కాల్చి చంపింది.

 తిరుగుబాటు ప్రారంభం కాకముందే బెంగాల్‌లోని బారక్‌పూర్‌లో ‘మంగళ్ పాండే’ ఎన్‌ఫీల్డ్ తూటాలు ఉపయోగించేందుకు నిరాకరించి, లెఫ్ట్‌నెంట్ బాగ్ అనే అధికారిని 1857, మార్చి 29న కాల్చిచంపాడు. మంగళ్‌పాండేను 1857 సిపాయి తిరుగుబాటు కాలం నాటి తొలి హీరోగా వీడీ సావర్కర్ పేర్కొన్నారు.

 తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు

 ఇది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.  ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో మాత్రమే దీనికి సామాన్య ప్రజల మద్దతు లభించింది.  సర్ జాన్ లారెన్‌‌స మంచి పాలన అందించి పంజాబ్ ప్రజలు, సిక్కులు తిరుగుబాటులో చేరకుండా చూశాడు.గ్వాలియర్ రాజు సింధియా, ఇండోర్ రాజు హోల్కర్, నేపాల్ రాణా, హైదరాబాద్ నవాబు తదితర స్వదేశీ సంస్థానాధీశులు తిరుగుబాటును అణచివేయడంలో బ్రిటిష్ వారికి మద్దతిచ్చారు. తిరుగుబాటు నాయకుల మధ్య సమన్వయం, ముందుచూపు కొరవడ్డాయి. పూర్వ యుద్ధ అనుభవం లేకపోవడం కూడా వైఫల్యానికి మరో కారణం. బ్రిటిష్ వారికి అధునాతన సైన్యం, ఆయుధాలు, రైల్వే, టెలిగ్రాఫ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
  ఫలితాలు
 1958 చట్టం ప్రకారం కంపెనీ పాలన రద్దయి అధికారం బ్రిటిష్ పార్లమెంట్ వశమైంది.
 బ్రిటన్ రాణి దేశాధినేత అయ్యారు. గవర్నర్ జనరల్ పదవి.. వైశ్రాయ్ పదవిగా మారింది. లార్‌‌డ కానింగ్ మొదటి వైశ్రాయ్ అయ్యాడు. తిరుగుబాటు తర్వాత స్వదేశీ సంస్థానాధీశుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం స్నేహపూర్వక ధోరణిని ప్రదర్శించింది.  సైన్యంలో దేశభక్తి భావాలు ఏర్పడకుండా సైన్యాన్ని కులం, ప్రాంతం పేరుతో విడగొట్టారు. ఉదా: సిక్కు రెజిమెంట్, గూర్ఖా రెజిమెంట్, మద్రాసు రెజిమెంట్.  తిరుగుబాటులో పాల్గొన్న రాజపుత్రులు, బ్రాహ్మణులను సైన్యంలోకి తీసుకోవడం తగ్గించారు. తిరుగుబాటులో పాల్గొనని సిక్కులు, గూర్ఖాలు, మద్రాసీలను సైన్యంలోకి తీసుకున్నారు. తిరుగుబాటుతో ప్రభుత్వ ఆర్థిక స్థితి దెబ్బతింది. దాంతో జేమ్స్ విల్సన్  కమిటీని నియమించి దీని సూచన మేరకు ఆదాయపు పన్ను (ఐటీ), పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టారు.

No comments:

Post a Comment

Pages

close