యూరోపియన్‌ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు - Grate Thing

Breaking

Home Top Ad

Friday, September 13, 2019

యూరోపియన్‌ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు


ప్రాచీన కాలం నుంచి భారతదేశానికి తూర్పు, పశ్చిమ దేశాలతో వర్తక సంబంధాలుండేవి. ముఖ్యంగా మధ్యయుగ కాలంలో ఆసియాకు సంబంధించిన వ్యాపారం అరబ్బులు, మధ్యదరా తీర ప్రాంతానికి, యూరప్‌కు సంబంధించి ఇటాలియన్‌ల చేతుల్లో ఉండేది. వీరు ఎప్పుడూ వాణిజ్య అంశాలపైన దృష్టి నిలిపేవారు. అయితే మధ్యయుగ చివరి దశలో మన దేశానికి యూరోపియన్‌ వర్తకుల రూపంలో పెనుముప్పే వచ్చింది. కేవలం వర్తకం మీదనే దృష్టి నిలపకుండా దేశ రాజకీయాలలో జోక్యం చేసుకునేవి. వాటిలో వర్తకం ద్వారా బలంగా స్థిరపడిన ఇంగ్లండ్‌ దేశం భారతదేశాన్ని సుమారు 347 సంవత్సరాలు పాలించింది. ఈ విశేషాలు తెలుసుకునేముందు ఎందుకు యూరోపియన్‌లు భారతదేశానికి వచ్చారు? వారి విధానాలేమిటి?.. లాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం....

- క్రైస్తవులకు, మహ్మదీయులకు మధ్య జరిగిన చివరి మత యుద్ధం (క్రూసేడ్‌)లో '' కాన్‌స్టాంటెన్‌ శ×'' రాజు (బైజాంటిన్‌ రాజ్యం) ని ఒటోమాన్‌ టర్కుల రాజు ''మహ్మద్‌ ×× '' క్రీ.శ. 1453లో ఓడించి వారి ప్రధాన రాజధాని నగరమైన ''కాన్‌స్టాంటినోపిల్‌''ని ఆక్రమించారు. ఫలితంగా తూర్పు, పశ్చిమ దేశాల మధ్య వర్తక మార్గాలు టర్కుల చేతుల్లోకి వచ్చాయి. కాన్‌స్టాంటినోపిల్‌ మార్గంగా తూర్పు దేశాలకు వెళ్లడాన్ని నిషేధించారు.
వర్తక వాణిజ్యాల మార్గం మూసుకుని పోవడం, ఆర్థికంగా యూరప్‌ దేశాలకు నష్టం రావడమే గాకుండా నిత్యం ఆహారంలో వాడే ఉప్పు, మిరియం (నల్లబంగారం) లాంటి సుగంధ ద్రవ్యాల కొరత వారిని వేధించేది.
15వ శతాబ్దంలో నౌకా నిర్మాణంలో, నౌకాయాన సాంకేతిక విజ్ఞానంలో అద్భుత ప్రగతిని స్పెయిన్‌, పోర్చుగీస్‌ దేశాలు చూపించాయి. తదుపరి ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌లు కూడా రంగంలోకి దిగాయి.
ఐరోపాలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కర్మాగారాలకు కావాలిసిన ముడి సరుకు సరఫరా ప్రాధాన్యత పెరిగింది.

మధ్యయుగం వరకు తూర్పు- పశ్చిమ దేశాల మధ్య వాణిజ్య మార్గాలు:
భారత వాయువ్య సరిహద్దు కనుమల గుండా పోయి, మధ్య ఆసియా, రష్యాలను దాటి బాల్టిక్‌ సముద్ర తీరాన్ని చేరడం; ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసి భూ మార్గాన ఈజిప్టు లోని అలెగ్జాండ్రియా రేవు చేరుకుని అక్కడి నుండి సముద్ర మార్గంలో వెనిస్‌, జెనోవాలను చేరడం; మరొక మార్గం పర్షియన్‌ సింధూ శాఖ వెంబడి సముద్ర మార్గం, అక్కడ నుండి ఇరాక్‌, టర్కీల గుండా భూ మార్గం, తదుపరి సముద్ర మార్గం ద్వారా వెనిస్‌, జెనోవాలను చేరుకోవడం.
సముద్ర మార్గ అన్వేషకులు- భారత్‌కి రాక
నల్లసముద్రం మధ్యదరా సముద్రంపై కొత్తగా నెలకొన్న తురుష్క ఆధిపత్యాన్ని సవాలు చేసే బాధ్యతను స్పెయిన్‌, పోర్చుగీస్‌ స్వీకరించగా భారతదేశ, తూర్పు దేశాల సిరిసం పదలపై వ్యామోహంతో వ్యాపార నిమిత్తం పోర్చుగల్‌, డచ్‌ (నెదర్లాండ్‌), ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, డేన్‌ (డెన్మార్క్‌) దేశాలు భారత్‌కు వచ్చాయి.
1. పోర్చుగీస్‌
తూర్పు దేశాలకు భౌగోళిక విషయాలు కనిపెట్టడానికి పోర్చుగీసు ప్రభుత్వ ప్రోద్బలం చాలా ముఖ్యమైంది. దాని పాలకుడైన ''డామ్‌ హెన్రీ'' నౌకాయానంపై ఉత్సాహంతో ఒక నావికా పాఠశాలను ప్రారంభించాడు. ఇతనికి ''హెన్రీది నేవిగేటర్‌'' అనే బిరుదు ఉంది. అతని తదుపరి రాజు ''రెండో జాన్‌'' ప్రోత్సాహంతో ''బార్తులోముడైస్‌'' క్రీ.శ. 1487 లో ఆఫ్రికా దక్షిణ కొనవరకు వెళ్ళి తుఫానుల అగ్రం (కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌)ని కనుగొన్నాడు. క్రీ.శ. 1494లో స్పెయిన్‌ దేశస్థుడు కొలంబస్‌ భారత దేశానికి చేరుకోవాలని బయలుదేరి అమెరికా ఖండాన్ని కనుగొన్నాడు.
పోర్చుగీసు వారు తూర్పు దేశాలతో వ్యాపార హక్కులను గుర్తిస్తూ క్రైస్తవ మతాధినేత (పోప్‌) క్రీ.శ. 1493లో చార్టర్‌ జారీ చేశారు. పోర్చుగీసీయుడైన ''వాస్కోడిగామా'' పోర్చుగల్‌లోని ''లిస్బన్‌'' నుంచి బయలుదేరి ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి ప్రయాణించి గుడ్‌హోప్‌ అగ్రాన్ని చుట్టాడు. తర్వాత హిందూ సముద్రం ద్వారా ప్రయాణించి గుజరాత్‌కు చెందిన ''అబ్దుల్‌ మజీద్‌'' అనే నావికుని మార్గదర్శకంలో ప్రయాణించి 1498 మే 17న భారత పశ్చిమ తీరంలో ఉన్న కాలికట్‌ రేవులో అడుగుపెట్టాడు. ఆ ప్రాంత పాలకుడు ''జమోరిన్‌'' వాస్కోడిగామాను సాధరంగా ఆహ్వానించాడు. మొట్టమొదటిగా సముద్ర మార్గాన వచ్చి భారతీయులను కలిసిన యూరోపియన్‌ వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. అమెరికాకి మార్గం, భారతదేశానికి గుడ్‌హోప్‌ అగ్రం మీదుగా నూతన సముద్ర మార్గాన్ని కనిపెట్టడం అనేది '' మానవ జాతి చరిత్రలో నమోదైన రెండు అత్యంత ప్రధానమైన, మహత్తర సంఘటనలు'' గా ప్రముఖ ఆర్థికవేత్త ''ఆడంస్మిత్‌'' వర్ణించారు.
క్రీ.శ. 1500 లో కాబ్రల్‌, 1503లో మళ్లీ వాస్కోడిగామా రావడం జరిగింది. మహ్మదీయ వర్తకులు వ్యాపారం చేయకూడదని వాస్కోడిగామా జామోరిన్‌ని కోరగా, అతడు తిరస్కరణతో కాలికట్‌పై కాల్పులు జరిపి, లొంగదీసుకుని కోటని అక్కడే నిర్మించాడు. పోర్చుగీస్‌ వర్తకులు హిందూ సముద్రంపై ఆధిపత్యం, వర్తక నిమిత్తం సముద్ర వర్తక సంఘానికి ''ఎస్టాడో ద ఇండియా''గా నామకరణం చేశారు.
డి.ఆల్మిడా (1505-09)
భారతదేశంలో పోర్చుగీసు స్థావరాలను కాపాడుటకు డి. ఆల్మిడా రాజప్రతినిధిగా వచ్చారు. కొచ్చిన్‌లో కాబ్రల్‌ నిర్మించిన కోటను బలిష్టం చేయడంతో పాటు, లన్ననూర్‌ దగ్గర కోటను నిర్మించాడు. 1509లో డయ్యూ వద్ద జరిగిన యుద్ధంలో విజయం సాధించి హిందూ సముద్రంపై అరబ్బుల పలుకుబడి ని అంతరింప చేసి పోర్చుగీసు ప్రాబల్యాన్ని పెంచాడు. సముద్రం మీద తమ అధికారాన్ని స్థాపిస్తే గానీ భూమి మీద తమ అధికారానికి స్థానం ఉండదని తలచి బలమైన నౌకా దళాన్ని నిర్మించాడు. దానినే ''బ్లూ వాటర్‌ పాలసీ'' అంటారు.
అప్పాన్‌-సో-డి- ఆల్‌బుకర్క్‌ ( 1509-1515)
పోర్చుగీసు పాలకులలో గొప్పవాడు. పోర్చుగల్‌ అధికారాన్ని మన దేశంలో స్థాపించి వారి స్థావరాలను వృద్ధి పరిచాడు. అందుకే ఇతనిని ''పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత'' అని పేరు ఉన్నది. వర్తకానికి అనువైన స్థలాలను, ఆత్మ రక్షణలను, భౌగోళికంగా అనువైన స్థలాలను ఆక్రమించడం, స్వాధీన పరుచుకోవడం, వర్ణ సంకర వివాహాల ద్వారా వలసలను ఏర్పాటు చేయడం ఇతని విధానాలు. ఇతను విజయనగర రాజైన శ్రీకృష్ణ దేవరాయలుతో స్నేహం చేశాడు. 1510 సంవత్సరంలో బీజాపూర్‌ సుల్తాన్‌ యూసఫ్‌ ఆదిల్‌షా సైన్యాన్ని ఓడించి గోవా తీర పట్టణాన్ని ఆక్రమించి కేంద్ర స్థానంగా చేశాడు. ఇతని తదుపరి వచ్చిన ''నినోడోకున్హా'' 1534లో గుజరాత్‌ సుల్తాన్‌ అయిన బహదూర్‌షా నుండి బేసిన్‌ను; 1537లో బేరెట్‌ డయ్యూను; డామన్‌, సాల్‌సెట్టి మొదలగు ప్రాంతాలను వశపరుచుకున్నారు.
భారతదేశ రాజులతో సంబంధాలు
1515 - 1560 సంవత్సరాల మధ్య అధికారం చురుకుగా విస్తరించడంతో వీరి రాయబారులు భారతదేశంలోని వివిధ రాజ్యాలకు వెళ్ళారు. విజయనగర ఆస్థానంలో ''మాల్యుకస్‌ పామేస్‌'', ''న్యూనిజ్‌''లు ఉన్నారు. గుజరాత్‌ సుల్తాన్‌ వీరి సహాయంతో ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నాడు. అక్బర్‌ రాజ్యానికి వచ్చేటప్పటికి భారతదేశంలో ఒక్క పోర్చుగీసు వారు మాత్రమే ఉన్నారు. 1601లో క్రైస్తవ మతంలోకి మహ్మదీయులను మార్చటానికి పోర్చుగీసులకు అనుమతి పత్రం ఇవ్వడంతో పాటు, ''జెరోం జేవియర్‌'' రాసిన ''పవిత్రతకు అర్థం'' (మిర్రర్‌ ఆఫ్‌ హోలినెస్‌), 'మెసయా జీవితం' అనే గ్రంథాలను పారశీకంలోకి తర్జుమా చేయిం చాడు. ఇబదత్‌ ఖానాలో చర్చలకు రోడోల్ఫ్‌ అక్వానివా, ఆంటోని మాన్‌సరత్‌, ఫ్రాన్సిస్‌ హెన్రిక్‌లను పోర్చుగీసు వారు పంపారు. మక్కాకు పోయే యాత్రికులకు పోర్చుగీసు వారి మూలంగా ఇబ్బంది రాకూడదని, దక్షిణ దేశంలో వీరి అధికారాన్ని అంతం చేయడానికి అక్బర్‌ సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.
అధికార వ్యాప్తి
దక్షిణ చైనాలోని మకావో పట్టణంలో స్థావరాలను నెలకొల్పి, జపాన్‌లో కూడా వర్తక సంబంధాలు ఏర్పాటు చేసుకు న్నారు. 1518లో కొలంబోలో కోట; 1538లో డామన్‌ తూర్పు ప్రాంతంలో నాగ పట్టణం, సాంథోరు, చిట్టగాంగ్‌, హుగ్లీలను సంపాదించారు. వీరికి పశ్చిమ తీరంలో రాజకీ యంగా పలుకుబడి పెరిగింది. గోవా ఆక్రమణతో బీజాపూర్‌ తో విబేధం ఏర్పడగా, విజయనగర (సాళువ, తులువ వంశాలు), గుజరాత్‌, ఆశిర్‌ఘర్‌ అధికారులతో స్నేహం కొనసాగింది. 1605 వరకు మొగలులతో సత్సంబం ధాలున్నా బ్రిటీష్‌ వారి రాకతో ఆధిక్యం నశిస్తూ వచ్చింది.
పాలనా విధానం
పోర్చుగీసు రాజు వలసల మీద సర్వాధికారి. వలసలకు వైస్రారు ఆధ్వర్యంలో పాలన ఉండేది. ఇతడి క్రింద వెడాల్‌ డి. ఫసెండా అనే ఉద్యోగి, సైనికులు, ఓడరేవులు, టంకశాల ఉంటాయి. క్రైస్తవ మత వ్యాప్తి కారణంగా రోమన్‌ చర్చి పోర్చుగీస్‌ ''జెషూట్‌యట్‌'' మతాచార్యులకు అనేక హక్కులు ఇచ్చింది. సర్‌ఫ్రాన్సిస్‌ జేవియర్‌ ''గోవా''లో కాలుపెట్టిన మొదటి క్రైస్తవ మతాచార్యుడు. గోవాలో క్రైస్తవులు అధికులై క్రైస్తవులు కానివారిని తప్పకుండా ఆదివారం ప్రార్థనలో పాల్గొనాలని నిర్బంధించేవారు.
పతనం: దక్షిణ అమెరికాలో బ్రెజిల్‌ని కనుగొన్న తరువాత వారి దృష్టి పశ్చిమ దేశాలవైపు మళ్లింది. 1580లో పోర్చుగల్‌ స్పెయిన్‌లో విలీనం కావడంతో దాని స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయింది. 1565లో తళ్ళి కోటయుద్ధంలో విజయనగర సామ్రాజ్యం నాశనం కావడంతో వీరికి సాయం ఆగిపోగా, బహుమనీలు చెలరేగారు.
3. వర్ణ సంకరానికి పాల్పడటం మరియు బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చడంతో భారతీయులలో వారిపట్ల ద్వేషం కలిగింది.
4. డచ్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ దేశాల ధాటికి తట్టుకోలేక పోయింది. ఫలితంగా 17వ శతాబ్దం ప్రారంభం నాటికి సగానికిపైగా స్థావరాలు కోల్పోయి గోవా, డయ్యూ, డామన్‌ లు మాత్రమే మిగిలాయి. వీటిని స్వతంత్ర భారతదేశం సైనిక చర్య ద్వారా 1961లో విలీనం చేసుకుంది.
2. డేన్‌లు
1620 లో డెన్మార్క్‌ వర్తక సంస్థ స్థాపించారు. ట్రాంక్వీబార్‌ (తంజావూర్‌), 1676లో శ్రీరాంపూర్‌ (బెంగాల్‌) లోనూ స్థావరాలు ఏర్పాటు చేసింది. అయితే భారత్‌లో వ్యాపార లాభాలు రాక 1845లో వలస స్థావరాలను ఆంగ్లేయులకు అమ్మివేసింది.
3. డచ్‌:
హాలండ్‌ దేశస్తులైన వీరు 1572-80 వరకు నెదర్లాండ్‌లో పౌరులుగా ఉండి తరువాత స్పెయిన్‌ వారి ఆధీనంలో నుంచి బయటపడి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఐరోపాకు తూర్పు నుంచి వాడుకలో ఉన్న సముద్ర వర్తక మార్గాలు పోర్చుగల్‌ ఆధీనంలో ఉన్నందువల్ల వీరు పడమటి నుంచి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొని 1595 నుండి 1602 వరకు 15 సార్లు భారత్‌ను సందర్శిం చారు. పోర్చుగీసుకు వ్యతిరేకంగా ఇంగ్లీష్‌ వారితో కలిసారు.
డచ్‌ వారందరూ కలిసి 1602లో ''డచ్‌ ఈస్టిండియా కంపెనీ'' గా ఏర్పడి భారత్‌లో తూర్పు సముద్ర మార్గాలపై వర్తకాన్ని సాగించారు.
భారతదేశ వ్యాపారం కంటే తమకు ఆగేయాసియా దేశాలతో వ్యాపారం మంచిదని సుగంధ ద్వీపాలపై (మలయ, జావా, సుమత్రా) తమ అధికారాన్ని స్థాపించ వలెనని ఆశించారు. 1605లో అంబాయినాను, పోర్చుగీసు తో పోరాడి మలయాద్వీపకల్పం (ఆర్చిపెలాగో)లోని మలక్కాను, సింహళాన్ని ఆక్రమించారు.
డచ్‌ వారికి ఆంగ్లేయులకు మొదట స్నేహ సంబంధాలు న్నాయి. తర్వాత 17వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లండ్‌ను పాలించిన స్టువర్ట్‌ చక్రవర్తులు స్పెయిన్‌ మద్దతు విధానం అనుసరించడంతో డచ్‌ వారికి, ఆంగ్లేయులకు మనస్పర్థలు పెరిగాయి. 1623లో డచ్‌ గవర్నరైన వాన్‌స్పెల్ట్‌ అంబా యినా లోని పది మంది ఆంగ్ల వర్తకులను వధింపచేశారు. ఫలితంగా ఆంగ్లేయులు తూర్పు దీవులపై ఆశ వదులుకుని భారత్‌పైన దృష్టిని నిలిపారు.
భారతదేశంలో డచ్‌వారు ఎక్కువగా వస్త్ర పరిశ్రమ వైపు దృష్టి సారించారు. యూరోపియన్‌ వర్తకాన్ని సుగంధ ద్రవ్యాల నుంచి ఇతర వస్తువుల మీదకు మళ్ళించిన ఘనత వీరికే దక్కుతుంది. 1604-05లలో గోల్కొండ నవాబు అనుమతితో మచిలీపట్నం వద్ద; 1608-09 జింజి దగ్గరున్న గంగపట్నం; పులికాట్‌లోను (1610); భీముని పట్నం (1641)లోనూ వర్తక స్థావరాలను ఏర్పాటుచేసు కున్నారు. జహంగీరు నుంచి వర్తకానికి 1653లో అనుమతి పొంది ''చిన్సురా'' (బెంగాల్‌) తో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1690లో ప్రధాన వర్తక కేంద్రాన్ని పులికాట్‌ నుంచి 'నాగపట్టణానికి' మార్చారు.
కంపెనీ పాలనా విధానం
డచ్‌ కంపెనీ వాటాదారులంతా కలిసి ఆరు విభాగాలుగా ఏర్పడి ఆరు ప్రధాన పట్టణాల్లో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటిని చాంబర్స్‌ అంటారు. ఒక్కొక్క చాంబర్‌కు పాలన కోసం ప్రత్యేకంగా ఒక కౌన్సిల్‌ ఉండేది. ఆరు కౌన్సిల్‌లు కలిపి డచ్‌ ఈస్టిండియా కంపెనీ అనే ప్రధాన పాలక వర్గంగా ఏర్పడింది. వారు 17 మంది సభ్యులున్న సభని ఎన్నుకుంటారు. వారిని ''డైరెక్టర్స్‌'' అంటారు.
డచ్‌ దేశస్థులు ఇంగ్లాండ్‌ ఫ్రాన్స్‌ దేశస్థుల కంటే బలహీనులు. మొదటి నుంచి వీరి ఆసక్తి ఆగేయాసియా మీదనే. కాబట్టి భారతదేశ వ్యాపారాల మీద శ్రద్ధ చూపలేదు. వీరు1759 సంవత్సరంలో బెడెరా యుద్ధంలో బ్రిటీష్‌ వారి చేతిలో ఓడిపోయారు. సుశిక్షితులైన ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ సేనల ముందు వీరి సేనలు నిలవలేకపోయాయి.

No comments:

Post a Comment

Pages

close