ఇక్ష్వాకులు – చరిత్ర – సంస్కృతి - Grate Thing

Breaking

Home Top Ad

Wednesday, September 11, 2019

ఇక్ష్వాకులు – చరిత్ర – సంస్కృతి

ఇక్ష్వాకులు – చరిత్ర – సంస్కృతి
శాతవాహనుల పాలనకు, వేంగీ (తూర్పు) చాళుక్యుల పాలనకు మధ్యగల కాలాన్ని ‘శాతవాహన వారసుల యుగం’ (క్రీ.శ. 225-624) అని అంటారు. శాతవాహనుల సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ఇక్ష్వాకులు కృష్ణా, గోదావరి ప్రాంతాన్ని దాదాపు 75 నుంచి 100 సం.లు పాలించారు.
ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు నాగార్జున కొండ ( శ్రీపర్వతం ) ప్రాంతంలో లభించాయి. ఈ శాసనాలు బ్రహ్మీలిపిలోని ప్రాకృత భాషలో ఉన్నాయి.
ఇక్ష్వాకులు శాతవాహనుల కింద మహాతలవరులుగా ఉండేవారు. నేటి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పాలిస్తుండేవారు. ఇక్ష్వాకురాజు శాంతిమూలుడు పుగియ, హిరణ్యక, ధనిక, కులాహల్‌ సామంతుల సహాయంతో శాతవాహన రాజైన మూడో పులోమావిని ఓడించి తన్ను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.
ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు – శ్రీ శాంతమూలుడు.
వీరి రాజధాని – విజయపురి. (ప్రస్తుత నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్‌)
ఇక్ష్వాకుల రాజచిహ్నం – సింహం
పురాణాలలో ఏడుగురు ఇక్ష్వాకుల గురించి ప్రస్థావన ఉంది. శాసనాలలో 4గురు ఇక్ష్వాకుల గురించి మాత్రమే రాయబడింది. అయితే ఇటీవల (1954-61) దొరికిన శాసనాల ఆధారంగా రుద్రపురుష దత్తుని తర్వాత రెండవ ఏహుబల శాంతమూలుడు కూడా పాలించినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి ఇక్ష్వాకుల చివరి పాలకుడు రెండవ ఏహుబల శాంతమూలుడు.
ఇక్ష్వాకుల వంశంలో ఐదుగురు రాజులున్నారు. వారు :
1.శ్రీ వాసిష్ఠీ శాంతమూలుడు, 2. వీర పురుషదత్తుడు,  3.ఎహుబల శాంతమూలుడు,   4.రుద్రపురుష దత్తుడు,   5. రెండవ ఏహుబల శాంతమూలుడు.
గొప్పవాడు – వీరపురుష దత్తుడు, చివరివాడు – రుద్ర పురుషదత్తుడు.
శ్రీ పర్వతీ పుత్రులుగా, ఆంధ్ర భృత్యులుగా ప్రసిద్ధి చెందారు.
­వీరు తమకు తాము అయోధ్య పాలకులైన సూర్యవంశీయులుగా (రాముడి వంశం) ప్రకటించుకున్నారు.
వీరి కాలాన్ని బౌద్ధ మతానికి ‘స్వర్ణయుగం’గా పేర్కొంటారు.
గౌతమ బుద్ధుని వంశమైన శాక్యముని వంశీయులమని నాగార్జునకొండ శాసనం ద్వారా ప్రకటించుకున్నారు.
వీరు ‘ఉజ్జయిని’ మహాసేనుని భక్తులు.
వీరి జన్మస్థలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. వీరు ఉత్తర భారత దేశం నుంచి వచ్చినట్లు రాప్సన్‌, బూలర్‌ అభిప్రాయపడ్డారు. కన్నడ ప్రాంతమని వోగెల్‌ చెప్పగా, తమిళనాడు వీరి జన్మస్థలమని గోపాలచారి ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రాంత మధ్యలో ఉన్న కృష్ణా తీరంలో జన్మించారని కాల్‌డ్వెల్‌ అభిప్రాయం.

  1. మొదటి వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు (క్రీ.శ.225-245) :
బిరుదులు : శత సహస్ర హాలక, మహాదానాధిపతి, దక్షిణపథ సామ్రాట్‌
శాసనాలు : రెంటాల, దాచేపల్లి, కేశనాపల్లి.
ఇతడు చివరి శాతవాహన రాజైన ‘మూడో పులోమావి’ ని ఓడించి రాజ్యస్థాపన చేశాడు. ఇతడు మహావీరుడు, అప్రతిహత శాసనుడు. నేటి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్లగొండ, తూర్పు గోదావరి జిల్లాలతో కూడిన పెద్ద రాజ్యం స్థాపించి మహారాజ బిరుదు ధరించాడు.
శాంతమూలుని సామంతులు – పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు.
ఇతడు కార్తికేయుని భక్తుడు. అగ్నిస్తోమ, అగ్నిహోత్ర మహాక్రమ క్రతువులు చేశాడు. లక్షల కొద్ది బంగారు నాణేలు, శతసహస్ర నాగళ్లు (లక్ష నాగళ్లు), భూమిని దానం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.
రాజ్య విస్తరణ కోసం అశ్వమేధ, రాజసూయ యాగాలు నిర్వహించినట్లు ఇతని కుమారుడు వీరపురుషదత్తుడు వేయించిన శాసనం ద్వారా తెలుస్తుంది. నాగార్జున కొండ వద్ద అశ్వమేధ యాగ వేదిక బయటపడింది. శక, అబీర, యవన, గర్దభి జాతులను జయించి రాజ్యాన్ని విస్తరించినట్లు తెలుస్తుంది.
వాశిష్టీపుత్ర శాంతమూలుని సోదరిణులు – శాంతిశ్రీ, హర్మ్యశ్రీ. సోదరి శాంతిశ్రీని పుగియ వంశానికి చెందిన శాశిష్ఠీపుత్ర స్కందశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు. శాంతమూలుని కుమార్తె- అడవి శాంతిశ్రీ. ఈమెను ధనిక వంశానికి చెందిన స్కంద విఖాఖునికిచ్చి వివాహం చేశాడు. ఇతడు అభీరులనుండి రాజ్యాన్ని కాపాడుకోవటానికి క్షత్రపులతో బంధాలు పెట్టుకున్నాడు. ఈమె నాగార్జున కొండలోని బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది.

  1. వీరపురుషదత్తుడు (క్రీ.శ.245-265) :
శాంతమూలుని తర్వాత అతని కుమారుడు వీరపురుషదత్తుడు పాలనలోకి వచ్చాడు.
శాసనాలు : జగ్గయ్యపేట, నాగార్జున కొండ, అమరావతి, ఉప్పుకొండూరు. ఇవి ఇక్ష్వాకుల చరిత్రకు ముఖ్య ఆధారాలుగా చెప్పవచ్చు.
ఇతని కాలంలో ‘ఆనందుడు’ శ్రీపర్వత విహారానికి మరమ్మత్తులు చేయించాడు.
ఇతని తల్లి మాఠరీ. తల్లి పేరుమీద మఠరీపుత్ర వీరపురుష దత్తుడు అని పిలుస్తారు.
పట్టపురాణి – భట్టిమహాదేవి, 2వ పట్టపురాణి – రుద్ర భాట్టారిక.
అంతేకాకుండా మేనత్త శాంతశ్రీ కుమార్తెలైన బాపిశ్రీ, షష్టిశ్రీలను వివాహమాడాడు. వీళ్ల ప్రభావంతో శైవ మతం నుంచి బౌద్ధమతంలోకి మారాడు.
ఇతని కూతురు కొడబలిసిరిని వనవాస మహారాజైన శివస్కంధ నాగశాతకర్ణికిచ్చి విశాహం చేశాడు.
ఇతడు బౌద్ధ మతాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేశాడు. ఇతని కాలాన్నే బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు.
మధిర, నేలకొండపల్లి ప్రాంతాలు ఇతని రాజ్యంలోనే ఉన్నాయి. ఫణిగిరి (నల్లగొండ జిల్లా)లో ఇతనికి సంబంధించిన నాణేలు లభించాయి. పై ఆధారాల వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం వీరి ఆధీనంలో ఉందని చెప్పవచ్చు.
ఇతిని అధికారి ఎలిసిరి తనపేరు మీద ‘ఏలేశ్వరం’ అనే ఆలయాన్ని నిర్మించాడు.
ఉజ్జయిని పాలకుడైన శకరాజు కుమార్తెను వీరపురుషదత్తుడు వివాహమాడాడు. దీన్నిబట్టి వీరి రాజ్యం ఉజ్జయిని వరకు విస్తరించిందని చరిత్రకారుడు డా.కృష్ణారావు పేర్కొన్నారు.
ఉపాసిక బోధిశ్రీ :
వీరపురుష దత్తుని కాలంలో ‘ఉపాసిక బోధిశ్రీ ‘ బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసినది. ఈమె అమరావతిలో భాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు. తన పేరుమీద ‘ఉపాసిక బోధిశ్రీ శాసనాలు’ వేయించి బౌద్ధ మతం కోసం చేసిన సేవలను వివరించింది. శ్రీలంక, కాశ్మీర్‌, టిబెట్‌ ప్రాంతాలకు బౌద్ధ సన్యాసులను పంపినట్లు ఈ శాసనాల ద్వారా తెలుస్తోంది. చూలదమ్మగిరి కొండపై బౌద్ధ విహారం, చైత్యం నిర్మించింది. పుష్పగిరి వద్ద శిలామండపాన్ని నిర్మించింది.

3.ఎహుబల శాంతమూలుడు (క్రీ.శ.265-290) :
వీరపురుషదత్తుని తర్వాత అతని కుమారుడు ఎహుబల (బహుబల) శాంతమూలుడు సింహాసనాన్ని అధిష్టించాడు.
ఇతని కాలం నాటి ప్రాకృత శాసనం – గుమ్మడిగుర్రు (స్థూప శాసనం). ఈ శాసనం వల్ల గుమ్మడిగుర్రులో బౌద్ధ విద్యాకేంద్రం విలసిల్లిందని తెలుస్తుంది. ఇక్ష్వాకుల కాలంనాటి స్త్రీ పురుషుల పేర్లు ఈ శాసనాల వల్ల తెలుస్తుంది.
నాగార్జున కొండ సంస్కృత శాసనం – ఇతని పాలనలో 11వ ఏట వేయించాడు.
ఇతని కాలంలో వైదిక, బౌద్ధం రెండూ వ్యాపించాయి.
ఇతని పాలనలో 11వ ఏట అతని సోదరి కొడబలిసిరి నాగార్జున కొండలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది. దీన్నిబట్టి ఇతడు కనీసం పదకొండేండ్లు పాలించినట్లు తెలుస్తోంది.
దక్షిణ భారత్‌లో తొలి సంస్కృత శాసనం – నాగార్జున కొండ శాసనం.
దక్షిణ భారత దేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటి రాజు – ఎహుబల శాంతమూలుడు.
దేవాలయాలు : పుష్టభద్ర నారాయణస్వామి ఆలయం, కార్తికేయుని ఆలయం, నందికేశ్వర ఆలయం, నవగ్రహ ఆలయం, హరీతి దేవాలయం.
నాగార్జున కొండలో అభీరవసుసేనుని సేనాని శివసేనుని శాసనం ఉంది. ఇది వసుసేనుని 30వ పాలన కాలం నాటిది.

4.రుద్రపురుషదత్తుడు (క్రీ.శ.290-300) :
ఎహుబల శాంతమూలుని తర్వాత రుద్రపురుష దత్తుడు అధికారంలోకొచ్చాడు.
గుంటూరు జిల్లాలోని గురజాలలో లభించిన శాసనాన్ని బట్టి ఇతడు ఇక్ష్వాకు రాజవంశానికి చెందినవాడుగా చరిత్రకారుల అభిప్రాయం. ఈ శాసనంలో ‘రుద్రపురుషదత్తు’ అనే పేరుతో ఇతని విశేషాలున్నాయి. ఇక్కడే లభించిన రెండో శాసనం ఆధారంగా ఇతడు ఎహుబల శాంతమూలుని కుమారుడని తెలుస్తోంది.
ఇతడు భగవంతుడయిన హలంపురస్వామికి కొంతభూమిని సమర్పించాడు. ఈ హలంపురాన్ని పల్నాడు తాలుకాలోని ‘మాగులవరం’గా గుర్తించారు. ఇతడు నాలుగేండ్లు పాలించినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది.
రుద్రపురుష దత్తుడు బలహీనుడగుట వల్ల పల్లవ రాజైన సింహవర్మ ఇతడిని ఓడించి ఇక్ష్వాకు రాజ్య దక్షిణ భూభాగాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. సామ్రాజ్యంలో మిగిలిన భూములు సామంతులు ఆక్రమించుకోవటంతో ఇక్ష్వాకుల పాలన అంతరించినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
కానీ ఇటీవల (1954-61) దొరికిన శాసనాల ఆధారంగా రుద్రపురుష దత్తుని తర్వాత రెండవ ఏహుబల శాంతమూలుడు కూడా పాలించినట్లు తెలుస్తుంది.

  1. రెండవ ఎహుబల శాంతమూలుడు :
ఇప్పటి వరకు దొరికిన చారిత్రక ఆధారాల వల్ల 2వ ఎహుబల శాంతమూలుడే చివరి ఇక్ష్వాక రాజుగా స్పష్టమవుతోంది.
ఇతని శాసనాలు నాగార్జున కొండ తవ్వకాలలో (1954-61) విస్తారంగా లభించాయి.
ఇతని కాలానికి ప్రాకృతం స్థానంలో సంస్కృతం రాజభాషగా స్థిరపడింది.
ఇతడు బ్రాహ్మణ మతాన్ని అనుసరించాడు. ఇతడు కొలిచిన దైవం – స్వామి హరిసేనుడు.
విజయపురీ నగరంలో కార్తికేయాలయం ఇతని కాలంలోనే నిర్మించబడింది. పుష్పభద్రస్వామి ఆలయం, నొదగేశ్వర ఆలయం, దేవీ ఆలయం ఇతని కాలంలోనే నిర్మించారు.
ఇతని పాలనా కాలంలో 11వ ఏట ఒక భీకరమైన సంగ్రామం (యుద్ధం) జరిగినట్లు, ఈ యుద్ధంలో ఇతని సేనాధిపతి ఎలిశ్రీకి కార్తికేయుని కృప వలన విజయం సిద్ధించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.
నాగార్జున కొండ తవ్వకాలలో అభార వసుషేణుని పాలనలోని 30వ ఏటి శాసనం ఒకటి లభించింది. ఇది 2వ ఎహుబల శాంతమూలుని కాలం నాటిదే.
ఈ శాసనంలో అవంతి శకరాజైన రుద్రదమనుడు, వనవాస ప్రభువైన విష్ణురుద్ర శావలానంద శాతకర్ణి మొదలైన వారి ప్రసక్తి ఉంది. వీరంతా ఇక్ష్వాకుల కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. వీరు శాంత మూలునికి సహాయపడేందుకు వచ్చి, అదే సందర్భంలో అష్టభుజి స్వామి ఆలయాన్ని ప్రతిషటించినట్లు తెలుస్తుంది.
ఇక్ష్వాకుల రాజ్య పతనం :
క్రీ.శ.3 – 4 శతాబ్దాల మధ్య కాలంలో పల్లవుల దండయాత్రల వల్ల ఇక్ష్వాకుల పాలన అంతమైనట్లు కనబడుతోంది.
గుంటూరు జిల్లా పల్నాడు తాలుకాలోని మంచికల్లులో నరసింహవర్మ శాసనం ఒకటి లభించింది. ఈ శాసనంలోని లిపి ప్రాకృతంలో ఉన్న ఇక్ష్వాకుల శాసనలిపిని పోలి ఉంది. ఇప్పటి వరకు దొరికిన పల్లవ శాసనలాలలో ఇదే ప్రాచీనమైనది.
ఇక్ష్వాకుల పాలన :
ఇక్ష్వాకులు శాతవాహనుల సామంతులు కావడం వల్ల పాలన విషయాల్లోనూ, మత వ్యాప్తిలోనూ వారిని అనుసరించారు.
వీరి శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి.
పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలుగా, హారాలుగా, పథాలుగా విభజించారు.
రాష్ట్ర పాలకులుగా మహాతలవరులు, మహాసేనాపతులు, మహాదండ నాయకులను నియమించేవారు.
ప్రధాన న్యాయమూర్తిని ‘మహాతలవరి’ అనేవారు. కాలక్రమంలో ‘తలవరి’ అనే పదం ‘తలారి’గా మారింది. తలారే గ్రామ రక్షకుడు.
మత పరిస్థితులు :
ఇక్ష్వాకు వంశ స్థాపకుడైన శాంతమూలుడు వైదిక మతాన్ని అనుసరించాడు. పరమత సహనం పాటించాడు.
ఏహువల శాంతమూలుని సేనాని ఎలిపిరి ‘కుమారస్వామి’ ఆలయాన్ని నిర్మించాడు. కృష్ణానదికి ఉత్తర తీరాన ‘శ్రీ ఏలేశ్వరస్వామి’ని ప్రతిష్టించటమే కాక ఆ ప్రాంతంలో ఒక పట్టణాన్ని నిర్మించి ‘వేద విద్యాకేంద్రంగా’ అభివృద్ధి చేశాడు.
నాగార్జున కొండలో ఉన్న రాజోచిత వస్త్రాలంకార భూషణుడి చిత్రం శాంతమూలుని సార్వభౌమత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
‘హారతి’ అనే దేవతను చిన్న పిల్లల దేవత అనేవారు.
పుష్టభద్ర స్వామి ఆలయాన్ని శఖసేనుడు నిర్మించాడు.
అష్టభుజ స్వామి దేవాలయం వీరి కాలంలో నిర్మించిందే. గజపృష్ట ఆకారంలో నిర్మించారు.
వీరి కాలంలో ‘వీరకళ్‌’ అనే మత సంప్రదాయం ఉండేది.
బౌద్ధ మతంలోని ‘నిఖయశాఖ’ వ్యాప్తి చెందింది.
ఉజ్జయిని మహాసేనుని గొప్ప భక్తుడు – శ్రీశాంతుడు.
ఇక్ష్వాకుల వంశంలో రాజులు బ్రాహ్మణ మతాన్ని అనుసరిస్తే, రాణులు బౌద్ధ మతాన్ని అభిమానించారు.
మొదటి శాంతమూలుడు ఉత్తర భారతం నుండి అనేక మంది బ్రాహ్మణులను రప్పించి అగ్రహారాలను దానం చేశాడు.
బౌద్ధ విద్యలకు నాగార్జున కొండ, వైదిక విద్యలకు ఏలేశ్వర క్షేత్రం కేంద్రాలుగా ఉండేవి. (ఏలేశ్వరం ప్రస్తుతం నాగార్జున సాగర్‌ నీటిలో మునిగి పోయింది.)
ఇక్కడి ధాన్యకటక సంఘారామం ఆదర్శంగా తీసుకొని టిబెట్‌లోని ‘దాపంగ్‌’ సంఘారామం నిర్వహించేది.
తిధి, వార, నక్షత్ర, పక్ష, మాసాలతో కూడిన పంచాంగం వీరి కాలంలో ఉండేది.
వీరి కాలంలో రుతువులు – గ్రీష్మ, వర్ష, హేమంత రుతువులు. రుతువుకి నాలుగు నెలలుగా పరిగణించేవారు.
ఈ కాలానికి సంబంధించిన కొన్ని చారిత్రక విషయాలు జైనమత గ్రంథం ‘ధర్మామృతం’ వల్ల తెలుస్తున్నాయి. ధర్మామృతం గ్రంథాన్ని నరేంద్రసేన శిష్యుడు నయనసేనుడు రచించాడు. ఇతడు జైన మత అభిమాని. జైన మతం పాటించి, మోక్షం, సద్గతి పొందిన మహానీయుల చరిత్రలు ఈ కావ్యంలో వర్ణించబడ్డాయి. జైన మత నిర్మాణాలు సంఘశ్రీ తదితర అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ :
ఇక్ష్వాకులు వర్తకానికి అధిక ప్రాధాన్యాన్నిచ్చారు. గ్రీకు, రోమ్, ఈజిప్టు మొదలైన పశ్చిమ దేశాలతో సముద్రయానం చేసి వర్తక వ్యాపారాలు నిర్వహించారు. చైనా, సుమత్రా, జావా, బోర్నియా వంటి దేశాలలో వర్తకం చేసి విశేషంగా ధనాన్ని అర్జించారు.
శాంతమూలుడు వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు. వ్యవసాయం కోసం అడవులను నరికించి, భూదానాలను చేశాడు. కాలువులు తవ్వించి, రైతులకు అనేక సౌకర్యాలు కల్పించడంతో దేశం పాడి పంటలతో సమృద్ధిగా ఉండేది.
వీరి నాణేలపై రాజలాంఛనం (సింహం) తో పాటు, రాజుల పేర్లు కూడా ఉన్నాయి. బంగారం, సీసం, పోటీన్‌ నాణేలు వీరి కాలంలో వ్యాప్తిలో ఉన్నాయి.
ఇక్ష్వాకుల కాలం నాటి పన్నలు గురించి ‘విశిష్ట శాసనం’ తెలుపుతుంది. వీరి కాలంలో తొలిసారిగా తమలపాకుల తోటలను ప్రవేశపెట్టారు.
ఇక్ష్వాకుల కాలంలో వర్తక శ్రేణులు : పుసిన శ్రేణి – మిఠాయి వ్యాపారుల సంఘం, పర్నిక శ్రేణి – తమలపాకుల వ్యాపారులు.
ఆర్థిక రంగంలో ప్రధాన పాత్ర పోషించిన వర్తకులు – పర్నిక.
చేతి వృత్తుల సంఘానికి ‘ఉలిక’ ప్రముఖ నాయకుడుగా వ్యవహరించేవాడు.
వృత్తి పన్నులు విధించినట్లుగా విషవట్టి శాసనం తెలియజేస్తుంది.
సాంస్కృతిక అంశాలు :
ఇక్ష్వాకుల కాలంలో స్త్రీకి ఉన్నత స్థానం కల్పించినప్పటికీ, అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి. వీరి కాలంలో నిర్బంధ సతీసహగమనం అమలులో ఉండేది. మేనరిక వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి.
వీరి ప్రధానమతం వైదిక మతం. బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. పరమత సహనం కలిగి ఉన్నారు.
పూర్తిగా బౌద్ధ మతాన్ని అవలంభించిన రాజు – శ్రీ వీరపురుష దత్తుడు. ఇతడు శైవ మతాన్ని వ్యతిరేకించాడని తెలుస్తుంది. బుద్ధుని దంత అవశేషాల మీద నాగార్జున కొండ వద్ద మహా స్థూపాన్ని నిర్మించాడు.
వీరి కాలంలో స్ణూపాల ప్రాకారాలు కొయ్యలతో నిర్మించబడ్డాయి. శిల్పనిర్మాణానికి ఆకుపచ్చ రాయిని ఉపయోగించారు.
పాలనా సౌలభ్యం కోసం గ్రామ పంచికలు, మహా గ్రామాలు అనే విభాగాలు ఏర్పరిచారు.
వర్తక బృందాలను ‘నేగిమాలు’, న్యాయాధికారులను ‘మహా తలవారులు’ అనేవారు.
వీరి కాలంలో నాగార్జున కొండపై అనేక బౌద్ధ ఆరామాలు వేయించిన బౌద్ధ సన్యాసి – బదంతచార్యులు.
నాగార్జున కొండపై ఉపాసిక బోధశ్రీ నిర్మించిన ముఖ్య ఆరామాలు :
తామ్ర వర్ణ ఆరామం – సింహళ దేశీయుల కోసం, కాశ్మీరు ఆరామం – కాశ్మీరీయుల కోసం, చినా ఆరామం – చైనీయుల కోసం, గాంధార ఆరామం– ఆఫ్ఘనిస్థాన్‌ వాసుల కోసం.
శ్రీలంకకు చెందిన ‘మహాదేవుడు’ అనే బౌద్ధ భిక్షువు పల్లవ పల్నాడు ‘బొగ్గ వద్ద’ బౌద్ధ మతాన్ని బోధించాడు. 14 లక్షల 60 వేల మందిని శ్రీలకంకు వలసకు తీసుకెళ్లాడు.
వీరి పాలనలో ‘వీరగల్‌’ అనే సంప్రదాయం ఉండేది. అంటే రాజు కోసం జీవించి, రాజుకోసం మరణించే అంగరక్షకులు.
ఇక్ష్వాకుల జ్నాపకార్థం విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. ప్రస్తుతం ఈ విధనం జపాన్‌లో ఉంది. వీరిని సమురాయ్‌ లు అంటారు.
బౌద్ధ గ్రంథాలలోని ‘నిఖయ’లను మంత్రాల రూపంలో చదివే పద్ధతి మొట్టమొదటి సారి వీరి కాలంలోనే ప్రారంభమైంది.
సాహిత్య అంశాలు :
భారత్‌లో సంస్కృతాన్ని పునరుద్ధరించిన వారు – ఇక్ష్వాకులు.
ఎలిశ్రీ – వీరి కాలంలో తొలి శాసనం ( సంస్కృతం)
సంస్కృత శాసనాలు ముద్రించిన తొలి రాజవంశం – ఇక్ష్వాకులు
శాసనాల్లో శిల్పుల పేర్లు, కాలం ముద్రించడం వీరి కాలంలోనే ప్రారంభమైంది.
నాగార్జున కొండ – శిల్పకళా విశేషాలు :
ఇక్కడ 5 ప్రసిద్ధ శిల్పాలున్నాయి. వీటిని మాట్లాడే శిల్పాలు అంటారు. అవి :
  1. బుద్ధుడు స్వర్గం నుంచి దిగుతున్న శిల్పం, 2. ఐదుగురు రాణులు వివారిస్తున్నా రాజు బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేయటం, 3. రాజు ఎడమ కాలితో శివలింగాన్ని తోసివేయటం, 4. రాజు ఎనిమిది మందితో సన్యాస ఆశ్రమానికి వెళ్లటం, 5.రాజు ధనాన్ని బౌద్ధ భిక్షువులకు దానం చేయటం.
నిర్మాణాలు :
పారవత విహారం : వీరపురుష దత్తుని మేనత్త శాంతిశ్రీ, శ్రీ పర్వతంపై ఉన్న మహాస్థూపాన్ని పున:నిర్మించింది.
నాగార్జున కొండపై విహారం : ఎహుబల శాంతమూలుడి సోదరి కొండబలిసిరి ‘మహాశాసకుల’ కోసం విహారం నిర్మించింది.
మహాచైత్యం : వీర పురుషుడు శ్రీపర్వతంను బౌద్ధ మతాచార్యుడు భతానందుడి సమక్షంలో పునరుద్ధరించాడు.
భట్టిమహాదేవి : ఈమె వీరపురుష దత్తుని భార్య. ఈమె శ్రీపర్వతంలో బహుశృతీయుల కోసం ఒక విహారాన్ని నిర్మించింది.
అదనపు సమాచారం :
విజయపురి నిర్మాత – శాతవాహన చక్రవర్తి విజయశ్రీ.
నొదగిరి స్వామి దేవాలయాన్ని నిర్మించింది – రాతవస్య అనుశ్రీ.
సింహళ(శ్రీలంక) విహారానికి దానాలు చేసింది – బోధిసిరి.
నాగార్జున కొండలో కనిపించిన బౌద్ధ శాఖలు – బహుశ్రుతీయ, ధేరవాయ.
హుయాన్‌త్సాంగ్‌ ప్రకారం భావవివేకుడు నాగార్జున కొండలో నివసించాడు.
ఇక్కడ ధ్వని విజ్నాన వేదిక అద్భుత కట్టడం బయటపడింది.
బోధిసిరి 3 విహారాలను నిర్మించిన ప్రదేశం – తెరుముత్తున.
బౌద్ధ శిల్పాలకు వర్ణ చిత్రీకరణే ‘అజంతా చిత్రాలు’ అని చెప్పినది – బర్గెస్‌.
సప్తమాతృక శిల్పం – చేజెర్ల, నర్సింహస్వామి శిల్పం – నెమలిపురి.
సర్వదేవాది వాసాన్ని ఎలిసిరి కుమారస్వామి నిర్మించాడు.
మహిశాసక శాఖ బౌద్ధ మతానికి చెందినది.
భవత ఆనందుడు వీరపురుష దత్తుడి ఆస్థానంలో ఉన్నాడు.
ఇక్ష్వాకుల కాలంలో 20 స్థూపాలు నిర్మించబడ్డాయి.
కుబేర, నవగ్రహ ఆలయాలు నాగార్జున కొండ వద్ద ఉన్నాయి.
నాగార్జున కొండలో సంతానం కోసం సప్తమాత్రక శిల్పాలు చెక్కింది ఎవరు – ఇక్ష్వాకులు.
ఇక్ష్వాకు అంటే చెరుకు రసం అని అర్థం.
మాందాత శిల్పం జగ్గయ్య పేటలో ఉంది.
యాగాలు : రాజసూయ యాగం, అశ్వమేధ యాగం –స్వరాట్‌, వాజపేయ యాగం – విరాట్‌, నరమేధ యాగం – ఏక విరాట్‌. ఆంధ్రుల చరిత్రలో నరమేథయాగ చేసిన ఒకే ఒక రాజవంశం – విష్ణుకుండినులు ( 2వ మాధవవర్మ).
నాగార్జున కొండ ‘మహాయానం’కు కేంద్రస్థానమైంది.
భారత్‌లో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం – శ్రీపర్వత విశ్వవిద్యాలయం. అతిప్రాచీన విశ్వవిద్యాలయం – తక్షశిల.
వీరపురుష దత్తుని కాలంలో (క్రీ.శ.300) నాగార్జున విశ్వవిద్యాలయానికి ప్రధాన ఉపకులపతి – 2వ నాగార్జునుడు.
భారత్‌లో తొలి సంస్కృత శాసనం – జునాఘడ్‌ శాసనం ( రుద్రదాముడు ).
నాగార్జున కొండలో తొలిదశలో మహాయాన బౌద్ధం, మలిదశలో హీనయాన బౌద్ధం వర్ధిల్లాయి.
మహాయానంలో 1. అపరమహాశైలి, 2బహుశృతీయ, 3.మహావిహారవాసి, 4.మహాశాసన అనే నాలుగు ప్రధాన శాఖలు ఏర్పడ్డాయి.
బౌద్ధ స్థూపాల నిర్మాణంలో – ముడుపు స్థూపాలు. అంటే కోరిక తీరినందుకు కట్టబడే నిర్మాణాలు. ఇవి ఆకృతిలో చాలా చిన్నవి.
నాగార్జున కొండలో బౌద్ధ విహారాలను నిర్మించిన శిల్పిగా బదంతా చార్య పేరు చెక్కి ఉంది.
నాగార్జున కొండను ‘దక్షిణ గయ’గా పేర్కొంటారు.
అమరావతి శిల్పాలలో సతీసహగమనం మొట్టమొదటి సారిగా కనిపిస్తుంది.
ఇక్ష్వాకుల శిల్పాలలో అతిముఖ్యమైనది – మాందాత శిల్పం ( జగ్గయ్యపేట). చక్రవర్తి ఎలా ఉంటాడో ( రాజు లక్షణాలు ) ఈ శిల్పలంలో చూపించబడింది.
ఇక్ష్వాకుల వంశం వరుస క్రమం : మొదటి వాశిష్ఠీపుత్ర శాంతమూలుడు-మాఠరీపుత్ర శ్రీవీర పురుష దత్తుడు-రెండవ వాశిష్ఠీపుత్ర ఎహుబల (బహుబల) శాంతమూలుడు- రుద్రపురుష దత్తుడు.
భారత దేశంలో మొదటగా ఏర్పడిన ద్వీపపు మ్యూజియం – నాగార్జున కొండ.
గోదావరి తీరంలో అస్మక, మూలక రాజ్యాలను ఇక్ష్వాకు వంశ రాజకుమారులు స్థాపించారని బౌద్ధసాహిత్యం ద్వారా తెలుస్తుంది.
శాతవాహనులు బ్రాహ్మణులైతే, ఇక్ష్వాకులు క్షత్రియులని చెప్పినది – ఆర్‌.జి.భండార్కర్‌.

No comments:

Post a Comment

Pages

close